– భూదాన్ పోచంపల్లిలో వేదిరే రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ
– పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 18 : భూదానోద్యమం ప్రపంచానికే స్ఫూర్తి అని, ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో వెదిరే రామచంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి కాoస్య విగ్రహాన్ని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. స్థానిక టూరిజం పార్క్ లో ఆచార్య వినోబా భావె, వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 75వ వజ్రోత్సవాల సందర్భంగా వినోబా మందిరాన్ని సందర్శించి పాదయాత్ర బృందానికి, భూదాన్ భూమి గ్రహీతలకు, నాయకులకు శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. భూదాన దాతృత్వం దేశానికి మార్గదర్శకoగా నిలచిందన్నారు. భూదానోద్యమం భూసంస్కరణలకు దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడిందన్నారు. 100 ఎకరాల భూదానంతో మొదలైన ఉద్యమం 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి, 40 లక్షల మంది పేదలకు భూమిని పంచి పెట్టారన్నారు. ఈ భూదానోద్యమంతో పోచంపల్లికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు లభించాయని తెలిపారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. వేదిరే రామచంద్రారెడ్డి 1000 ఎకరాల భూమిని పేదలకు దానం చేసిన కారణ జన్ముడన్నారు. భూమిని దానo చేయకుంటే భూదానోద్యమం ఆలోచన వచ్చేది కాదని అన్నారు. రామచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని, భూదానోద్యమ స్ఫూర్తితో యువత సామాజిక స్పృహ పెంపొందించాలన్నారు. భూదానోద్యమ స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాలకు భూములను పంచి అంకురార్పణ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్చినం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా డీలిమిటేషన్ బిల్లులో మహిళా బిల్లును జోడించి పెట్టడంతో పార్లమెంటులో బిల్లు వీగిపోయిందన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీకి చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రధాని ఒంటెద్దు పోకడలు మాని ప్రతిపక్ష అభిప్రాయాలతో బిల్లును తీసుకురావాలని సూచించారు.

ప్రపంచానికి స్ఫూర్తి భూదానోద్యమం : గుత్తా సుఖేందర్ రెడ్డి
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భూదానోద్యంతో పోచంపల్లి గ్రామం దశదిశ మార్చిందని అన్నారు. సమాజంలో సమానత్వం సేవా భావం పెంపొందించడంలో భూదానోద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. వేదిరే రామచంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. శివరాంపల్లి నుండి పోచంపల్లికి చేపట్టిన పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికి పాదయాత్ర బృందంలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమంలో అఖిల భారత సర్వోదయ మండలి అధ్యక్షుడు వేదిరే రామచంద్రారెడ్డి, అఖిల భారత సేవా సంఘ ట్రస్ట్ మహాదేవ్ విద్రోహి, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు తలుపునూరి కృష్ణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజని శ్రీనివాస్ గౌడ్, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, నాయకులు పాక మల్లేష్ యాదవ్, కొట్టం కరుణాకర్ రెడ్డి, తడక రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, భూదాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల దానయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కరగల కుమార్ పాల్గొన్నారు.