ఆలేరు టౌన్, మే 27 : ఆర్థిక ప్రయోజనాల కోసమే అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు, వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మంగళవారం ఆలేరులో పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గం నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి అంటే మహిళలను బజారు కీడ్చడం, అందచందాలను ప్రదర్శించడమేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికి అందాల పోటీలను నిర్వహించడం సబబేనా అన్నారు. రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన నెలకు రూ.2,500/- తదితర హామీలను అమలు చేయకుండా వారిని అవమానించడం కాదా విమర్శించారు. అందాల పోటీలను మహిళలు చైతన్యవంతంతో ఎదుర్కోవడానికి ప్రజాస్వామిక, ప్రజా ఉద్యమాల్లో సమాజ మార్పు కోసం సాగే పోరాటాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత మాట్లాడుతూ.. నిత్యం సమాజంలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి గురైతుండడంతో పాటు కుటుంబ హింస, అనేక అవమానాలకు, అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నట్లు తెలిపారు. పాలకులు అందాల పోటీల పేరుతో మహిళల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం వారిని మానసికంగా వేదించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, శశిరేఖ, జిల్లా నాయకురాలు గడ్డం పద్మ, సుంకే సుగుణ, తమ్మడి మాధవి, చిరబోయిన భద్రమ్మ, కొమ్మిడి లత, గడ్డం లక్ష్మి, ధనూజ, చిరబోయిన లక్ష్మి, ఎర్ర మైసమ్మ, దార సుగుణ, కడకంచి అనిత, ముత్తమ్మ, బోయిని లక్ష్మి పాల్గొన్నారు.