బీబీనగర్, అక్టోబర్ 08 : మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంటా సింగ్ అన్నారు. బుధవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా రోగులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేన్నయినా సాధించగలుగుతాడన్నారు. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం మరెంతో కీలకం అన్నారు.
నేటి సమాజంలో చాలా మందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండటం లేదని అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు యంత్రంలా పని చేస్తున్నారని, దీంతో ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మనిషి మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే జీవితం అంత బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ నితిన్ అశోక్జాన్, మెడికల్ సూపరింటెండెంట్ లక్కిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, విద్యార్థు, డాక్టర్లు పాల్గొన్నారు.
Bibinagar : మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకం : బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్