యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 : ఆర్టీసీ బస్సులు రాక పాఠశాలకు సమయం అయిపోతున్నదని ఆందోళనతో ఆటో ఎక్కిన విద్యార్థులు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్యార్థులు కొలనుపాక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం బస్సు రాకపోవడంతో గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో ఇద్దరు ఇతరులు ఆటో ఎక్కారు. కొలనుపాక గ్రామ పరిధిలో ఆటో ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం జరగకపోయినప్పటికీ బస్సు వచ్చి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్తులు ఆరోపించారు.
బస్సులు రాకపోవడంతో ఆటోలో ఎక్కిన విద్యార్థులకు ప్రమాదం జరిగిందని పేర్కొంటూ సోమారం గ్రామస్తులు కొలనుపాక గ్రామంలో రాస్తారోకో చేశారు. ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ బస్సులు నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అని నినదించారు. పాఠశాల సమయానికి అనుగుణంగా ఉదయం, సాయంత్రం కచ్చితంగా బస్సులు నడపాలని, లేకపోతే నిరసనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.