భువనగిరి అర్బన్, జనవరి 4 : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2017లో అంబేద్కర్ భవనం నిర్మించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధన సంఘం కలెక్టర్‌కు వినతి పపత్రం అందజేసింది. దాంతో కలెక్టర్ సింగన్నగూడెం చౌరస్తా సమీపంలో గల సర్వే నంబర్ 629లో భవన నిర్మాణానికి 900 గజాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించడంతో మంత్రిజగదీశ్రెడ్డి 2017 డిసెంబర్ 2న అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ క్రమంలో భవన నిర్మాణానికి స్థలం సరిపోదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దృష్టికి కమిటీ సభ్యులు తీసుకెళ్లగా ఆయన చొరవతో కలెక్టర్ అదే సర్వేనంబర్‌లో అదనంగా 1,810 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో పనులు ప్రారంభించారు. కాగా కరోనా నేపథ్యంలో నిధులు విడుదల కాకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి.
అన్ని సదుపాయాలతో..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయిలో అంబేద్కర్ భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా సింగన్నగూడెం చౌరస్తాలో నిర్మిస్తున్న జీ ప్లస్ వన్ అంబేద్కర్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న చిన్న సమావేశాల ఏర్పాటు కోసం ఓపెన్ హాల్, జీ ప్లస్‌లో అంబేద్కర్ ఆడిటోరియం, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం స్టడీ సర్కిల్, గ్రంథాలయం, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మరో రూ. 50 లక్షలైనా అందించడానికి కృషి చేస్తా
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. పట్టణ పరిధిలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. నిధులు సరిపోకపోతే మరో రూ. 50 లక్షలైనా ప్రభుత్వ పరంగా అందజేసేందుకు కృషి చేస్తా. కరోనా వల్ల పనుల్లో జాప్యం జరిగింది.భవన నిర్మాణం పూర్తయితే దళితుల పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.