భువనగిరి అర్బన్, జూలై 6: శునకాల నుంచి మనుషులకు వ్యాపించే రేబీస్ వ్యాధిని టీకాలుతో అరికట్టవచ్చునని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో రేబీస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచిత టీకాల పంపిణీ నిర్వహించారు. ఇందులో 98 కుక్కలకు ఉచిత రేబీస్ వ్యాధి నివారణ టీకాలు చేశారు. అంతకు ముందు రాచకొండ పోలీస్ డాగ్ స్వ్కాడ్ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రేబీస్ వ్యాధి ప్రాణంతమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందన్నారు.
ఆ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు రేబీసీ టీకాలను వేయించాలన్నారు. ప్రతి మూడు మాసాలు దాటిన కుక్కలకు ఉచితంగా రేబీస్ నివారణ టీకాలు వేయించాలని, ఈ టీకా పశు వైద్యశాలలో ఉచితంగా వేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎన్.మోతిలాల్, పశువైద్యశాల అసిస్టెంట్ డైరక్టర్ డాక్టర్ కె.గోపిరెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్లు వి.కృష్ణ, శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి, సునీత, చైతన్య, ప్రత్యుష, భాస్కర్, గిరి, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.