రాజాపేట, ఏప్రిల్ 09 : తుర్కకాశ, పత్తార్పోడ్లుగా పిలవబడే ముస్లిం కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తుక్కకాశ సంఘం రాష్ట్ర సభ్యుడు ఎస్కే కరీం అన్నారు. ఈ మేరకు బుధవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడేసాబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హజ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుర్కకాశ కార్మికుల సమస్యలు, వారు పడే కష్టాల గురించి వివరించారు. తుర్కకాశలు ఎండ వేడికి తట్టుకుని బండలు కొట్టుకుంటూ జీవన కొనసాగిస్తారన్నారు. ఈ క్రమంలో పలుమార్లు చేతులు, కాళ్లు విరగడం, గాయాలు కావడం జరుగుతుంటాయన్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతున్న ఈ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.