50వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కలెక్టర్ నేతృత్వంలో కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ
జిల్లాలో అందిన 570 దరఖాస్తులు
భువనగిరి కలెక్టరేట్, జనవరి 11 : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు. కన్నవారిని కోల్పోయి కొందరు.. కట్టుకున్నవారు పోయి మరికొందరు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కొంతమంది దుఃఖాన్ని దిగమింగుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కాటుకు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వైరస్ బారిన పడి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.50వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
కరోనా బారిన పడి మృతిచెందిన వారి వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా నమోదు చేస్తున్నారు. సర్కారు సాయం కోసం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీ సేవ కేంద్రాల ద్వారా మృతుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు జీవనోపాధి కోసం వెళ్లే వారికి ఊరట కలుగనుంది. కరోనా మరణాలను నమోదు చేసేందుకు, మృతుల కుటుంబాలకు సర్కారు సాయం అందించేందుకు కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా కేంద్రంలోని దవాఖాన సూపరింటెండెంట్ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటే కరోనా మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 570 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అందులో 556 దరఖాస్తులను ప్రాసెసింగ్ చేసినట్లు చెప్పారు. వాటిని కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేయనున్నట్లు
పరిశీలనలో దరఖాస్తులు
కరోనా మరణాలకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 570 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వాటిని పరిశీలించి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు అందేలా చూస్తాం.-సాంబశివరావు,