యాదాద్రి, అక్టోబర్ 1 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రీశుడికి తొలిపూజలతో పాటు సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణ పర్వాలను ఆగమశాస్త్రరీతిలో జరిపించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. బాలాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా సువర్ణ పుష్పార్చన జరిపించారు. నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. కొండ కింద పాతగోశాల వద్ద గల సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 6,71,836 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.