
చౌటుప్పల్, జూన్ 25 : అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు. విద్యారంగంలో తాను చేస్తున్న కృషికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా తన బాధ్యతగా భావించాడు. ఒక పక్క పాఠాలు బోధిస్తూనే మరో పక్క పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాడు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం అతన్ని ఆకర్షించింది. రాబోయే సమాజానికి మెరుగైన ప్రకృతిని అందించడం బాధ్యతగా భావించిన ఆయన హరితహారం యజ్ఞంలో తాను భాగస్వామ్యం కావడంతో పాటు విద్యార్థులు, ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకటి, రెండు కాదు వెయ్యి పాఠశాలల విద్యార్థులకు తన సొంత డబ్బులు రూ. 2.50 లక్షలు ఖర్చు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. మిత్రుడికోలేఖ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపకల్పన చేసి..విద్యార్థులకు లేఖల ద్వారా హరితహారం ప్రాధాన్యతను వివరించాడు. అంతేకాకుండా తమకు తెలిసిన మిత్రులకు లేఖల ద్వారా మొక్కలపై అవగాహన కల్పించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగట్టి రాజిరెడ్డి. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న విధానానికి ముగ్ధులైన మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆయన్ను అభినందించారు.
హరితహారంపై విద్యార్థులకు అవగాహన
ఉపాధ్యాయుడు రేగట్టి రాజిరెడ్డి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాడు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావించిన ఆయన గ్రామస్థాయిలో అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు హరితమిత్ర అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అప్పటి అశోక చక్రవర్తి స్ఫూర్తితో హరితహారాన్ని వినూత్నంగా చేపట్టేందుకు ఆలోచన చేశాడు. అశోక చక్రవర్తి మొక్కల పెంపకానికి అవలంబించిన విధానాలను తిరిగి ప్రజల చెంతకు తీసుకొచ్చేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు. అశోకుడి స్ఫూర్తితో హరిత అశోక చక్రం వాల్‌పోస్టర్‌కు రూపకల్పన చేశాడు. అశోకుడి ధర్మచక్రానికుండే 24 ఆకులతో 24 ప్రత్యేకాంశాలను రూపొందించి హరితహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించాడు. కేవలం తాను పనిచేస్తున్న తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యి పాఠశాలలకు హరిత అశోక చక్రం పంపిణీ చేసి మొక్కలపెంపకం ప్రాముఖ్యతను వివరించాడు.
మంత్రుల అభినందనలు..
హరితహారానికి రాజిరెడ్డి చేస్తున్న కృషిని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆయన్ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి వారు మంత్ర ముగ్ధులయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాగే పాటుపడాలని , తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు.
సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతనం..
ఒక పక్క పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే మరో పక్క అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు టీచర్ రాజిరెడ్డి. సమాజంలో అమ్మాయిలంటే ఉన్న చులకన భావాన్ని రూపుమాపేందుకు కృషి చేశాడు. అమ్మాయిల ప్రాధాన్యతను అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించాడు. సుమారు రెండు దశాబ్దాల నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ద్వారా తయారు చేస్తున్న వినాయక ప్రతిమలను ప్రతిష్టించవద్దని.. మట్టితో రూపొందించిన వాటినే వాడాలని అవగాహన కల్పించాడు. ఎయిడ్స్ నిర్మూలన, ఓటరు నమోదు పై ప్రజలకు అవగాహన కల్పించాడు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాడు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు , పారిశుధ్య కార్మికులకు తన సొంత డబ్బులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నాడు.
అనేక అవార్డులు పొందిన రాజిరెడ్డి
హరితహారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విశేష కృషి చేసిన టీచర్ రాజిరెడ్డిని అనేక అవార్డులు వరించాయి. హరితమిత్ర, పుడమి జాతీయ అవార్డు, అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం, న్యాకో జిల్లా బెస్ట్ ట్రైనర్ లాంటి అనేక అవార్డులు వచ్చాయి.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పెరిగిన టెక్నాలజీతో పర్యావరణకు ఎంతో ముప్పు వాటిళ్లుతున్నది. తెలిసో, తెలియకో మనం చేస్తున్న తప్పుల వల్ల పర్యావరణాన్ని పెను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీంతో మానవ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి వస్తుంది. అందుకే పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలని భావించా. ఈక్రమంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో నేనుసైతం భాగస్వామ్యం కావాలనుకున్నా. హరితహారం విజయవంతానికి విద్యార్థులతో పాటు ప్రజలకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించా. చాలా సరళంగా అర్థమయ్యేలా హరిత అశోక చక్రం పోస్టర్‌ను రూపకల్పన చేసి అవగాహన కల్పిస్తున్నా. ఇప్పటికే వెయ్యి పాఠశాలల విద్యార్థులకు హరితహారం పై అవగాహన కల్పించా. మిత్రుడికో లేఖ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరితహారాన్ని వివరించేందుకు కృషి చేస్తున్నా.
-రేగట్టి రాజిరెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లసింగారం