నీళ్ల దోపిడి చూసి పదమూడేళ్ల ప్రాయంలోనే ఆ కుర్రాడు చలించిపోయాడు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని చదువుతూ పోరాటం చేసిండు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. కనిపించిన ప్రతి పుస్తకం చదివాడు. కట్ చేస్తే… సినిమాల్లో తేలాడు ఏవీ అరవింద్. ఒకవైపు సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు తన బాల్య స్మృతులను ‘90s కిడ్ మ్యూజింగ్స్’ పేరుతో అక్షరీకరించిన యువ రచయిత బతుకమ్మతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
నేను పనిచేసిన ఇద్దరు డైరెక్టర్ల ఆలోచనలూ సమాజానికి దగ్గరగా ఉన్నాయి. అనుదీప్‌తో పనిచేసినప్పుడు ఒక సబ్జెక్ట్‌ను కాగితం మీదికి ఎలా తీసుకురావాలన్నది నేర్చుకున్నా. శేఖర్ సార్ దగ్గర పనిచేసినప్పుడు ఆ పేపర్ మీదున్న సబ్జెక్ట్‌ను సామాజిక బాధ్యతతో ఎలా చూపించాలో పసిగట్టాను. ఒకరి దగ్గర రైటర్‌గా, మరొకరి దగ్గర డైరెక్షన్ చేస్తూ సినిమా గురించి తెలుసుకున్నా.
మాది నల్లగొండ జిల్లాలోని బోజ్యా తండా అయినా బతుకుదెరువు కోసం దేవరకొండ సమీపంలోని మేడారానికి వలస వచ్చాం. అమ్మ అంజమ్మ, నాన్న వెంకటయ్య ఇద్దరూ కూలీపనులు చేస్తూ నన్ను, మా అక్కను చదివించారు. వాళ్ల రెక్కల కష్టం నాకు తెలుసు. అందుకే అమ్మానాన్న పేర్లలోని మొదటి అక్షరాలను నా ఇంటిపేరుగా పెట్టుకొని ఏవీ అరవింద్ అయ్యాను. పేద కుటుంబం కావడంతో సంక్షేమ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలోనే చదువుకున్నా. హాస్టల్లో ఉండటంతో నాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఆ ప్రభావంతో నేను తొమ్మిదో తరగతిలో ఉండగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. మాది కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో సాగర్ నీళ్ల కోసం పడే గోసలు, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని దగ్గర్నుంచి చూశాను. తెలంగాణ వస్తే మా తాండా జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆ వయసులోనే కలలు కన్నాను. రాష్ట్ర సాధన సమరంలో పసి వయసులోనే చురుగ్గా పాల్గొన్నా.

చిన్నతనంలోనే పెద్దవాళ్లతో కలిసి మిర్యాలగూడ, హాలియా రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించాం. మిలియన్ మార్చ్, ఓయూ దీక్షలకు హాజరయ్యా. ఉద్యమంలో పాల్గొంటూనే సామాజిక అంశాలపై వ్యాసాలు రాశా. ఎన్నో వ్యాసాలు నమస్తే తెలంగాణలో ప్రచురితమయ్యాయి. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కొచ్చి ఎంసీజే పూర్తి చేశా. రీడింగ్ క్లబ్‌లకు వెళ్తుండేవాణ్ని. అక్కడే దర్శకుడు కేవీ అనుదీప్‌తో పరిచయమైంది. తన టీంలో రైటర్‌గా అవకాశం ఇవ్వడంతో ప్రిన్స్ మూవీలో పనిచేశా.
తర్వాత శేఖర్ కమ్ముల టీం నుంచి ఫోన్ రావడంతో వాళ్ల టీంలో చేరా. ‘కుబేరా’కు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్‌గా చేరి చీఫ్ అసోసియేటివ్ డైరెక్టర్ దాకా ఎదిగా. శేఖర్ గారు నన్ను జూనియర్లా కాకుండా ఒక కొలీగ్లాగా ఆదరించారు. పెద్ద సినిమా కావడంతో చేతినిండా పని ఉండేది. అవిశ్రాంతంగా పనిచేస్తూ 18 గంటలు బిజీగా ఉండేవాళ్లం. ఆ సినిమా విడుదలయ్యే వరకు చాలా మంది నన్ను అపనమ్మకంతో చూశారు. ‘సినిమాల్లోకి వెళ్లాడు.. ఏమైపోతాడో’ అని అనుకునేవాళ్లు. కుబేర చూసిన తరువాత వాళ్లందరికి నా మీద ఓ నమ్మకం కలిగింది.
మాక్సిం గోర్కీ రాసిన ‘నా బాల్యం’, నామిని సుబ్రహ్మణ్యం ‘మిట్టూరోడి కథలు’ చదివిన తరువాత నాకో ఆలోచన తట్టింది. నా బాల్యంలోనూ ఇలాంటి స్మృతులే ఉన్నాయి కదా!.. వాటిని పుస్తక రూపంలోకి తేవాలనుకున్నా. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ‘90s కిడ్ మ్యూజింగ్స్’ పేరుతో రాయడం మొదలుపెట్టా. ఇటీవలే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించా. మొదటిసారి తండాలో రోడ్డు, తండాలో తొలి కలర్ టీవి… ఇలాంటి అరుదైన అనుభూతులెన్నో ఇందులో పొందుపరిచా. ‘జీవితం ఎప్పుడు వ్యక్తిగతం కాదని, సమూహం నుంచి రాజకీయం వరకు చేరిందని’ సిద్ధాంతపరమైన ఆలోచనలు కలిగిన ఓల్గా గారితో ఈ పుస్తకానికి ముందుమాట రాయించా. ‘ఈ నేపథ్యంలోంచి వచ్చినవాళ్లు సినిమా ఇండస్త్రీకి అవసరమని’ పుస్తకావిష్కరణకు వచ్చిన శేఖర్ సార్ కితాబిచ్చారు.
చాలా పుస్తకాలు చదివినా కూడా ఇప్పటివరకు నన్ను ప్రభావితం చేసిన పుస్తకాల్లో ప్రజల మనిషి, మహా ప్రస్థానం, గోర్కి అమ్మ నవల, మాలపల్లి, మోహనరాగం, అల్లం రాజయ్య కథలు అగ్రస్థానంలో ఉన్నాయి. చదవడంలో కూడా వినూత్నంగా ఆలోచిస్తుంటా. ఆ పుస్తకంలోని ప్రదేశాలకు వెళ్లి అక్కడే కూర్చొని వాటిని చూస్తూ చదువుతుంటా. అలా కోస్టల్ కర్ణాటక, ఉడుపి లాంటి ప్రదేశాలకు వెళ్లొచ్చా. చూసిన ప్రదేశాలను దాచుకునేందుకు ఫొటోలు తీయడం నేర్చుకున్నా. నేను ఎక్కడికెళ్లినా కెమెరాను తీసుకెళ్తుంటా. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. మళ్లీ శేఖర్గారితో పనిచేయాలని స్క్రిప్ట్ రాసుకుంటున్నా. కుబేర, బలగం లాంటి సామాజిక చిత్రాలు తీయాలన్నదే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన