యాదాద్రి, ఫిబ్రవరి15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మీ అమ్మవారిని ముప్పై మూడు కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన నరసింహస్వామిని దివ్యవిమాన రథోత్సవంపై ఊరేగే తంతును ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఎదురులేని దొరను ఎదురేగి పిలిచేము అంటూ కల్యాణమూర్తులు రథంలో తరలివస్తుండగా భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. అంతకుముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. రథంలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠించిన అర హృదయం వంటిందని ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే భగవంతుడు దర్శనమవుతారని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు వివరించారు. సోమవారం రాత్రి లక్ష్మీ అమ్మవారితో వివాహం జరుపుకునే లక్ష్మీనరసింహుడు అమ్మవారితో కలిసి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
వీర్మతాప భజన మండలి, గాయత్రీ భజన మండలి, డీఎన్ శ్రీదేవి, యాదాద్రి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకులు మోహనాచార్యులు, పాతగుట్ట ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఆలయ ఏఈఓలు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
గరుడవాహన సేవలో ఉత్సవమూర్తులు
ఉదయం స్వామివారి నిత్యరాధనల అనంతరం పారాయణీకులతో చతుర్వేద పారాయణాలు, నిత్య హవనములు, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు, లక్ష్మీ అష్టోత్తర నామ జపములను ఆలయ ప్రధానార్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, పాతగుట్ట అర్చకులు మాధవాచార్యులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయణీకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ ఉత్సవమూర్తులను గరుడ వాహన సేవలో తీరువీధుల్లో ఊరేగించారు. స్వామి వారి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు రథాంగ హోమం జరిపారు. యాజ్ఞీకులచే రథబలి నిర్వహించి దివ్యవిమాన రథంపై ఊరేగించారు.