
మునుగోడు, ఆగస్టు 30 : జిల్లాలో పత్తిని అధికంగా సాగుచేసే మండలాల్లో మునుగోడు ఒకటి. ప్రస్తుత వానకాలం సాగులో మండలవ్యాప్తంగా సుమారు 44,100 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈసారి 3.50లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదముందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఎరుపు రంగులోకి ఆకులు
అధిక వర్షాలకు పత్తి ఆకులు ఎరుపు రంగులోకి మారుతా యి. దీని నివారణకు ఫార్ములా-4, 19-19-19, 13-0-45 మందుల్లో ఒకదాన్ని కిలో చొప్పున 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి నివారణ కోసం 1:4 నిష్పత్తిలో మోనోక్రొటోఫాస్ లేక 1:20 నిష్పత్తిలో ఇమిడాక్లోప్రిడ్‌ను నీటిలో కలిపి మొక్కకు 30, 45, 60 రోజుల వయసులో కాండం పూత పద్ధతిలో వాడాలి. రసం పీల్చే పురుగు నివారణకు ఫిప్రొనిల్ 2 మిల్లీలీటర్లు, థయోమిథాక్సమ్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
గులాబీ రంగు పురుగు ఉధృతి
పత్తి చేనుకు 45 నుంచి 60 రోజుల వ్యవధిలో గులాబీ రంగు పురుగు సోకే అవకాశముంది. అధిక వర్షాలు కురిసినప్పుడు దీని బెడద ఎక్కువగా ఉంటుంది. గుడ్డిపూలు ఏర్పడటం, పూత రాలడం, కాయలపై మచ్చలు వచ్చినపుడు గులాబీ రంగు పురుగు సోకినట్లుగా గుర్తించాలి. వీటి ఉధృతి తెలుసుకునేందుకు ఎకరానికి 2 నుంచి 4 వరకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బుట్టల్లో తల్లి రెక్కల పురుగు ఉనికిని గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మండల పరిధిలోని 27 గ్రామపంచాయతీల్లో సుమారు 60 లింగాకర్షక బుట్టలను వ్యవసాయశాఖ ఏర్పాటు చేసింది.
వ్యవసాయశాఖ సలహాలు పాటించాలి
ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఇచ్చే సలహాలు, సూచనలను రైతులు పాటించాలి. సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై సందేహాలుంటే ఏఈవోలను అడిగి తెలుసుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక దిగుబడి సాధించొచ్చు. – సూదగాని శ్రీనివాస్‌గౌడ్, ఏవో