
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 23 : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని ఆనాడే చాటిచెప్పిన మహాత్మాగాంధీలాంటి నేతల కలలను నిజం చేస్తూ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు నేరాల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగా సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో మూడు వేల జనాభా ఉన్న యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామం ప్రస్తుతం పూర్తిగా నిఘా నీడలోకి చేరిపోయింది. గ్రామంలోని అన్ని కాలనీలు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమెరాల పరిధిలోకి వచ్చాయి. గ్రామంలో రూ. 11 లక్షల వ్యయంతో 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రికార్డు సృష్టించారు. ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షించే కంట్రోల్ వ్యవస్థను గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశారు.
గ్రామంలోని అన్ని చోట్ల ఏర్పాటు..
మాసాయిపేట గ్రామంలోని ప్రధాన ప్రదేశాలు, కాలనీలు, అన్ని వార్డులు, గ్రామంలోకి వచ్చే ప్రతి వాహనం కూడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. దీని వలన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చాల వరకు నియంత్రించవచ్చని పోలీసులు తెలిపారు. ఏదైనా దొంగతనం, ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులు సీసీ కెమెరాతో వెనకడుగు వేస్తారని, వెల్లడించారు.
రాజాపేట-యాదగిరిగుట్ట రహదారి పూర్తిగా నిఘా వ్యవస్థలో…
మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కెమెరాలతో యాదగిరిగుట్ట నుంచి రాజాపేట రహదారి పూర్తిగా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థలో చేరిపోయింది. యాదగిరిగుట్ట నుంచి రాజాపేట వైపునకు వెళ్లే ప్రతీ వాహనం సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఈ రహదారి మీదుగా ఏవైనా అనుమానస్పద వాహనాలు ప్రయాణించినా, ఇతరత్రా సమాచారం తెలుసుకోవడం పోలీసులకు సులభతరం అవుతుంది. గ్రామంలో తిరిగే ప్రతి వాహనం రికార్డు అవుతుంది. దీని వలన గ్రామస్తులకు ప్రయోజనం ఉండడంతో పాటు రక్షణ వలయంలో ఉంటారని గ్రామస్తులు తెలిపారు.
ప్రభుత్వవిప్, సీపీప్రత్యేకంగా అభినందన..
3వేల జనాభా ఉన్న గ్రామంలో 70 కెమెరాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ప్రభుత్వవిప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగావత్ ప్రశంసించారు. సీసీ కెమెరాలను ప్రారంభించేందుకు గ్రామంలో వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గ్రామస్తులను వారు ప్రత్యేకంగా అభినందించారు. మాసాయిపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని అన్నారు.
ప్రజల ప్రశాంతత కోసమే
మాసాయిపేట గ్రామస్తులు ప్రశాంతంగా జీవించడం కోసమే పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో గ్రామంలో 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గ్రామం మొత్తం కవర్ అయ్యేలా, ప్రధాన ప్రాంతాలు, గ్రామానికి వచ్చే, వెళ్లే వాహనాలు, వ్యక్తులను గుర్తించేలా సీసీ కెమెరాలు నెలకొల్పాం.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా..
మాసాయిపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం. వీటితో నేరాలు, దొంగతనాలను చాల వరకు నివారించవచ్చు. దొంగతనాలు, నేరాలు చేయాలనుకునే వారు సీసీ కెమెరాలను చూసి వెనకడుగు వేయాల్సిందే. 24 గంటలు పని చేసే సీసీ కెమెరాలతో భయం లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు. గ్రామానికి సంబంధించిన సీసీ కెమెరాలు కాని, కాలనీ, ఇండ్లలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఐపీ అడ్రస్ ద్వారా ఫోన్లో ఎక్కడున్నా కూడా చూడవచ్చు. మిగతా గ్రామాలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.