క్షేత్రపాలకుడికి ఆకుపూజ
శ్రీవారి ఖజానాకు 11,11,041ఆదాయం
యాదాద్రి, ఫిబ్రవరి15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యోత్సవాలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ మహా మండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేశారు. కొండపైన విష్ణు పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయ స్వామిని సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. తమలపాకులతో అర్చించారు. సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణం చేసి స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు రూ.11,11,041 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..
ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారని కానీ, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని జల్ బిర్దర్ జాతీయ కన్వీనర్ బొల్లిశెట్టి సత్యనారాయణ, మధురై సీనియర్ అడ్వకేట్ గురుస్వామి, వాటర్ మెన్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత డాక్టర్ రాజేందర్సింగ్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి వేద ఆశీర్వచనం అనుగ్రహించగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 ఏండ్ల క్రితం దేవాలయాలను నిర్మించిన శ్రీకృష్ణదేవరాయులు, 800 ఏండ్ల క్రితం గోపురాలను నిర్మించిన కాకతీయ రాజులను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాజు కాకపోయినా, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పాలకుడిగా రాజులకు దీటుగా గొప్ప అలయాన్ని నిర్మించారని అన్నారు. వెయ్యేండ్లు చరిత్రలో నిలిచిపోయేలా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారని పేర్కొన్నారు.