
భువనగిరి అర్బన్, ఆగస్టు 23: నూతనంగా చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం ఆమె భువనగిరి మండలంలోని తుక్కాపూర్ గ్రామ పరిధిలో పది ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను పరిశీలించారు. మొక్కలు నాటి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆరు వేల గుంతలు తీసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం ప్రారంభం నుంచి కంపచెట్ల తొలగింపు, భూమిని చదును చేయడం, గుంతలు తీయడం తదితర పనులను కలెక్టర్ ఫొటోల ద్వారా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది కూలీలతో ఉపాధిహామీలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అదే గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గ్రామ పంచాయతీకి చేరుకుని ఉపాధిహామీ పథకానికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయబడిన గ్రామ అభివృద్ధి పనులు, పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆసరా పింఛన్ల పంపిణీపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, గ్రామసర్పంచ్ నోముల పద్మామహేందర్రెడ్డి, ఎంపీవో అనురాధ, ఉప సర్పంచ్ ముంత సతీశ్, టెక్నికల్ అసిస్టెంట్ రామచంద్రచారి, కార్యదర్శి రాజు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’లో వినతుల వెల్లువ
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుంచి అర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి మాట్లాడారు. ‘ప్రజావాణి’ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలపై అలసత్వం వహించొద్దన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి అర్జీదారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా 57 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.