ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హై ఇంటెన్సిటీ పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆడియో గ్లింప్స్‌లో కూడా జైలు సూపరింటెండెంట్‌గా ప్రకాష్‌రాజ్ వాయిస్‌ను వినిపించారు. అయితే సినిమా నుంచి ప్రకాష్‌రాజ్ తప్పుకున్నారని, అందుకు దర్శకుడు సందీప్ రెడ్డితో వచ్చిన విభేదాలే కారణమని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
తాజాగా ఈ వార్తలను ప్రకాష్‌రాజ్ ఖండించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. “స్పిరిట్’ సినిమాపై విషపూరిత ప్రచారాన్ని చేస్తున్న అందరికి ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అప్పుడే వాట్సాప్ ఫ్యాక్టరీలో కట్టుకథల్ని అల్లుతున్నారు. కాస్త ఎదగండి. మంచి జీవితాన్ని గడపండి’ అంటూ స్పందించారు ప్రకాష్‌రాజ్. ఈ పోస్ట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారని తెలిసింది.