హాలియాలో ముస్తాబైన పోతులూరి శివ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం
హాలియా, పిబ్రవరి 11 : హాలియాలోని గోవిందమాంబదేవీ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి శివవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాఘమాసం ఏకాదశి రోజున ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆలయ 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, అంకురారోపణం, మంత్రిపుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గొట్టిముక్కుల నర్సింహాచార్యులు తెలిపారు.
17ఏండ్ల కిందట..
17ఏండ్ల కిందట హాలియాలో సాగర్ ఎడమ కాల్వ పక్కన చిన్న మండపంలో ఏర్పాటైన ఆలయం నేడు ఎంతో అభివృద్ధి చెందింది. భక్తుల తోడ్పాటుతో అన్ని హంగులు, సౌకర్యాలను సమకూర్చుకున్నది. ఆలయంలో శివ వీరబ్రహ్మేంద్ర స్వామితో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహ ఆరాధన మండపం కూడా ఉన్నది. శివుడు కూడ కొలువై ఉండడంతో శివవీరబ్రహ్మేంద్ర స్వామిగా పిలుచుకుంటున్నారు.