భువనగిరి కలెక్టరేట్, మే 30 : పొగాకు నిషేధాన్ని కఠినంగా అమలు చేసి స్మోకింగ్ ఫ్రీ జిల్లాగా చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని, పొగ తాగితే రూ.200 జరిమానా, జైలు శిక్ష ఉంటుందని అన్నారు. విద్యా సంస్థలకు వంద గజాల దూరం వరకు పొగాకు విక్రయాలు జరుగరాదని, 18ఏండ్లలోపు వారికి అమ్మినా, కొనుగోలు చేసినా నేరమని తెలిపారు.
పొగాకు వల్ల కలిగే నష్టాలను తెలుసుకొని వినియోగాన్ని మానుకోవాలని ప్రజలకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగేవారిపై దాడులు నిర్వహించి జరిమానా విధిస్తామన్నారు. ఈ నెల 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీఏఓ అనూరాధ, డీపీఓ సునంద, కమిటీ సభ్యులు నాగరాజు, భానుకుమార్ పాల్గొన్నారు.
పీఎం కేర్స్ పథకాన్ని
భువనగిరి కలెక్టరేట్ : పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన 12 మంది పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆరోగ్య బీమా కార్డు, రూ.10లక్షల డిపాజిట్ బ్యాంకు పాసుపుస్తకం, పీఎం కేర్ స్నేహ పత్ర సర్టిఫికెట్, ప్రధానమంత్రి జారీ చేసిన లేఖతో కూడిన ఫైల్‌ను అందించి మాట్లాడారు. బాధిత పిల్లల సంరక్షణకు నోడల్ అధికారులుగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అధైర్యపడొద్దని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తనతో నేరుగా మాట్లాడొచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యుడు ఎర్ర శివరాజ్, బాలల పరిరక్షణ అధికారి పి.సైదులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మంగ్తానాయక్, జిల్లా సహాయ వెనుకబడిన సంక్షేమ అధికారి గంగాధర్, జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజర్ జోసెఫ్, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, కొవిడ్ బాధిత పిల్లల సంరక్షకులు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : వలస కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సమగ్ర కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని ఒడిశా వలస కార్మికుల పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఒడిశా భాషలో ఉన్న 10 కథ వాచకాలను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తకాలు వలస కార్మికుల పిల్లలకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
కథ వాచక పుస్తకాలను పిల్లలకు అందించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమాధికారి, బాలల పరిరక్షణ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యుడు ఎర్ర శివరాజ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.సైదులు పాల్గొన్నారు.