యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొత్తగా యాదాద్రి భువనగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వైయూడీఏ) ఏర్పాటైంది. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ జీఓ జారీ చేశారు. అథారిటీలో రెండు మున్సిపాలిటీలు, 144 గ్రామాలను విలీనం చేశారు. దాంతో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నామమాత్రంగా మారనున్నాయి. జిల్లాలో ఇప్పటికే హెచ్ఎండీఏ, వైటీడీఏ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో అధిక శాతం అర్బన్ ఏరియా ఉంది. 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కొన్ని హెచ్ఎండీఏ, వైటీడీఏ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతపాదనలు పంపించారు. హెచ్ఎండీఏతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఉదాహరణగా చూపిస్తూ యుడా ఏర్పాటు చేయాలని భావించినట్లు జీఓలో పేర్కొన్నారు. యుడాలో రెండు మున్సిపాలిటీలు, 10 మండలాల్లోని 144 గ్రామాలను కలిపారు. ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీతోపాటు యాదగిరిగుట్టలోని 10 గ్రామాలు, అడ్డగూడూరులో 10, ఆలేరు మండలంలో 8, ఆత్మకూర్ (ఎం)లో 15, మోత్కూరులో 9, రాజాపేటలో 19, రామన్నపేటలో 19, వలిగొండలో 26, మోటకొండూర్‌లో 10, గుండాలలో 17 గ్రామాలను విలీనం చేశారు. ఇప్పటికే వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీతోపాటు యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలు అథారిటీ ఏర్పాటుతో ఇంకింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల నుంచి వచ్చే బెటర్మెంట్, డెవలప్మెంట్ ఫీజులు ఇప్పటి వరకు పంచాయతీల ఖాత్లానే జమ అవుతున్నాయి. ఇప్పుడు అథారిటీ ఏర్పాటు చేయడంతో డబ్బులన్నీ యుడా ఖాతాలోకి వెళ్లనున్నాయి. దాంతో పంచాయతీల ఆదాయం తగ్గిపోతుంది. కేవలం ఆస్తి పన్నులు, చెత్త సేకరణ యూజర్ చార్జీలపై ఆధారపడాల్సి ఉం టుంది. పంచాయతీలు అనుమతులు ఇవ్వడానికి అథారిటీ చట్టాలు ఒప్పుకోవు. ఇక ఇప్పుడు ఏ పని కావాలన్నా అథారిటీని ఆశ్రయించాలి. గ్రామాల్లో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా అథారిటీలో దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లాలోని 17 మండలాలకు గానూ 10 యుడా, 5 హెచ్ఎండీఏలో పరిధిలోకి వెళ్లాయి. హెచ్ఎండీఏలో భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతోపాటు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి మండలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఇలాగే కొనసాగిస్తారా, లేదా హెచ్ఎండీఏలో కలుపుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం హెచ్ఎండీఏలోకి మార్చాలని ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.