ఆలేరు టౌన్, మార్చి 6: ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎక్కువ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి వీరారెడ్డి సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.