అటవీ విస్తీర్ణం పెంచి, పచ్చదనం పంచి, పర్యావరణ సమతుల్యతను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం హరిత స్ఫూర్తిని కొనసాగిస్తున్నది. ఏడు విడుతల్లో మహా యజ్ఞంలా చేపట్టిన హరిత హారం సత్ఫలితాలనివ్వడంతో, ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాయి. ఏడో విడుతలో విస్తారంగా మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించిన జిల్లా
గ్రామీణాభివృద్ధి శాఖ.. మరింత లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా ప్రతి నర్సరీలో 10వేల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 467 నర్సరీల్లో 77లక్షల
మొక్కలను పెంచనున్నారు. పలుచోట్ల ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలు కాగా, అన్ని నర్సర్సీల్లోనూ నెలాఖరు నాటికి బ్యాగుల్లో విత్తనాలు వేసేందుకు ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నది. పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఏడు విడుతల్లో చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి యేటా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతూ సంరక్షణ చర్యలు చేపడుతూ వస్తున్నది. ప్రతి యేటా చేపడుతున్న ఈ కార్యక్రమం యాదాద్రి భువనగగిరి జిల్లాలో సత్ఫలితాలను ఇస్తుండగా..వచ్చే ఏడాదిలో చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారాన్ని సైతం విజయవంతం చేసే దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నది.
హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వం అదే స్థాయిలో నర్సరీల నిర్వహణను సైతం చేపడుతున్నది. ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నది. 2022-23 హరిత లక్ష్యంలో భాగంగా జిల్లాలో 77 లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధ్దిశాఖ ఆధ్వర్యంలో 418 నర్సరీల్లో 41.80 లక్షల మొక్కలను, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 24 నర్సరీల్లో 16 లక్షల మొక్కలను, అటవీ శాఖ ఆధ్వర్యంలో 25 నర్సరీల్లో 19.24 లక్షల మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విత్తనాల కొనుగోలు, బ్యాగులను సమకూర్చుకునేందుకు ఒక్కో నర్సరీకి రూ.1.28 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఈ నెలాఖరుకు నర్సరీలను సంసిద్ధ్దం చేసే దిశగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పచ్చబడుతున్న యాదాద్రి జిల్లా
పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆకుపచ్చ యాదాద్రికి బాటలు పరుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా ఏటా లక్షల్లో మొక్కలు నాటుతుండడంతో క్రమక్రమంగా పచ్చదనం పెంపొందుతూ వస్తున్నది. జిల్లాలో 4 శాతం మేర ఉన్న అటవీ విస్తీర్ణం సైతం పెరుగుతూ వస్తున్నది. నిన్నమొన్నటి వరకు రాళ్లు రప్పలతో కూడుకున్న అడవులు దట్టమైన అరణ్యాలను తలపిస్తున్నాయి. హరితహారంలో అన్ని శాఖలను భాగస్వాములను చేయడం..సంరక్షణ బాధ్యతలు, పకడ్బందీ చర్యలతో సీఎం కేసీఆర్ హరిత సంకల్పం నెరవేరుతున్నది. తాజాగా ఏడో విడుత హరితహారంలో జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ 18.50 లక్షల మొక్కలను నాటాలని భారీ లక్ష్యాన్ని పెట్టుకుని కొద్దిరోజుల క్రితమే 103 శాతం హరిత లక్ష్యాన్ని అధిగమించింది. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొక్కల పెంపకం, సంరక్షణపై టార్గెట్లు విధించడం..సంబంధిత అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో ప్రతి సంవత్సరం హరిత లక్ష్యం నెరవేరుతూ వస్తున్నది. పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు కూడా హరితలక్ష్యానికి దోహదపడుతూ వస్తున్నాయి.
హరిత లక్ష్యాన్ని అధిగమిస్తాం
ప్రతీ సంవత్సరం హరిత లక్ష్యాన్ని అధిగమిస్తున్నట్లుగానే వచ్చే ఏడాది కూడా అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నర్సరీలో ఈ నెలాఖరు నాటికి మొక్కల పెంపకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి 8వ విడుత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
-ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా