21వ శతాబ్దపు మహాద్భుతం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మన ఆధ్యాత్మిక వైభవం..
యాదాద్రి దివ్యక్షేత్రం. అపర వైకుంఠాన్ని తలపించేలా రూపుదిద్దుకున్న ఈ పంచనారసింహ
క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యానికి త్రిదండి చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ముహూర్తం
ఖరారైంది. 2022 మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో ఆలయాన్ని పునః ప్రారంభించను
న్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రిలో మంగళవారం పర్యటించిన సీఎం..
దాదాపు 8గంటలపాటు అలుపెరుగకుండా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
తుది దశ పనులపై అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. యాదాద్రి వసతుల
కల్పన, ఆధ్మాత్మిక, పర్యాటక అభివృద్ధి కార్యాచరణను నిరంతరాయంగా కొనసాగుతుందంటూ
అనేక వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట జిల్లా
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మండలి
మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత
మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.
సునీతమ్మా.. నీ జన్మ ధన్యం…
‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా.. నీ జన్మ ధన్యమైంది’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
యాదాద్రి.. ఒక యాది
మహోత్కృష్ణమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో, తెలంగాణలో చాలా విశిష్టమైనది, ప్రముఖమైనది, స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. నేనెప్పుడో యాభై ఏండ్ల క్రితం.. చాలా చిన్నగ ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి మా కుటుంబ సభ్యులతోని రావడం జరిగింది. అప్పుడు మెట్లగుండానే రావాలి,. ఎవరొచ్చినగూడ. అలా స్వామివారి దర్శనం చేసుకుని,
ఆ అదృష్టం పొందిన.
వచ్చే యేడాది మార్చి 21న అంకురార్పణ. ఆపై సుదర్శన మహా యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుంది. ఐదారువేల మంది రుత్వికులు, మరో మూడు నాలుగు వేల మంది సహాయకులు పాల్గొంటారు. ఆధ్మాత్మికంగా ఉత్కృష్టమైన కార్యక్రమం ఇది. ఇప్పటి నుంచే అనేక కార్యక్రమాలు, కూర్పులు చేస్తే తప్ప విజయవంతంగా ముందుకు సాగవు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ ఇంద్రకరణ్‌రెడ్డి దీన్ని నిత్యకార్యంగా దీన్ని భావించి, పర్యవేక్షించాలి.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం అందించింది. అనంతరం ఎనిమిది గంటల పాటు సీఎం కేసీఆర్ అణువణువునా పనులను పరిశీలించి మహా కుంభసంప్రోక్షణ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
స్వయంభువు లక్ష్మీనరసింహ క్షేత్రం..
యాదగిరిగుట్ట ఒకప్పుడు కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి. మంచినీళ్లకూ బాధపడ్డ పరిస్థితి. స్వామివారి సన్నిధిలో నృసింహ సాగర్ నిర్మాణం పూర్తికావస్తున్నది. స్వామిని అభిషేకించడానికి, భక్తుల పుణ్యస్నానాలకు కూడా పుణ్య గోదావరి జలాలు అందే అదృష్టం మనకు దక్కింది. స్వామివారి పాదాలను స్పృశిస్తూ.. ఆలేరు, భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గంలో ఐదున్నర లక్షల ఎకరాల్లో అద్భుతమైన పంటలు పండించనున్నది.
నిరంతరాయంగా అభివృద్ధి
యాదాద్రికి వస్తే గతంలో ఉండేందుకు స్థలం లేదనే బాధ ఉండేది. నేడు టెంపుల్ సిటీ నిర్మాణం చేపట్టినం. పెద్దలు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, రెండు మూడు రోజులు కుటుంబంతో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి. టెంపుల్ సిటీలో ఫస్ట్ ఫేజ్ లేఅవుట్లో 250 అద్భుతమైన కాటేజ్‌లు నిర్మిస్తాం.ఆలయ ప్రారంభోత్సవం తరువాత వసతుల పరంగా నిరంతరాయంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిరంతరాయంగా పనులను పర్యవేక్షిస్తారు.
గోదారి నీళ్లతోనే నిత్యం పుణ్య స్నానాలు..
రాష్ట్రంలో రెండో అతి పెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ నుంచి నృసింహ(బస్వాపుర్) రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లను తరలించి యాదాద్రిని సందర్శించుకునే భక్తులు నిత్యం గోదావరి నీళ్లతో పుణ్యస్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిరంతరం స్వామి వారి పాదాలను స్పృశించే ఈ జలాలు యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు నకిరేకల్ నియోజకవర్గాల్లోని 5.50 లక్షల ఎకరాలకు నీరందించే మహాభాగ్యం కలగబోతున్నది.
అలుపెరుగకుండా 8గంటల పాటు..