యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను జిల్లా అధికారులు తుంగలో తొకుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు కేటాయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ విస్తరణాధికారులపై పని భారం మోపుతున్నారు. తమకు సంబంధం లేని పనులతో ఒత్తిడి పెంచుతున్నారు. ఒకో ఏఈవోకు ఐదారు కొనుగోలు కేంద్రాల్లో అదనపు విధులు కేటాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా అదనపు పనులు చేయిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జీవోకు విరుద్ధంగా డ్యూటీలు..
2025 అక్టోబర్‌లో పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 17 ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరిశీలన బాధ్యతలు సంబంధిత కొనుగోలు ఇన్చార్జి లేదా సివిల్ సప్లయీస్ శాఖ టెక్నికల్ సిబ్బందిదే. ఏఈవోలు కేవలం పర్యవేక్షణ, సమన్వయానికి మాత్రమే పరిమితం కావాలి. అయితే జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏఈవోలకే ధాన్యం నాణ్యత పరిశీలన విధులు కేటాయించారు. జిల్లాలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు అందరికీ డ్యూటీలు వేశారు. దీంతో పని భారం పెరిగిపోతున్నది. ఒక యా దాద్రి జిల్లాలోనే ఈ విధంగా ఉందని, మిగతా చోట్ల సెంటర్ ఇన్చార్జి లేదా టెక్నికల్ పర్సన్ బాధ్యత తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకో ఏఈవోకు ఐదారు సెంటర్ల బాధ్యతలు
యాసంగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018లో జిల్లాలో 220 కొనుగోలు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం అవి 350కి పెరిగాయి. కానీ సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. జిల్లాలోని 17 మండలాల్లో 70 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. ఇప్పటికున్న పనులే వీరికి భారంగా మారాయి. ఇక యాదాద్రిలోని మొత్తం కొనుగోలు కేంద్రాలకు 70 మందిని కేటాయించారు. దీంతో ఒకో విస్తరణాధికారిని ఐదారు సెంటర్లకు ఇన్‌చార్జ్జిలుగా నియమించారు. ఒక రాశి నాణ్యత పరీక్షకు సుమారు 25 నిమిషాలు పడుతుండగా, రోజుకు వందల క్వింటాళ్ల ధాన్యాన్ని ఎలా పరీక్షించగలమని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. ఇది తీవ్ర భా రంతో కూడుకున్న పని, ఎండలో నాణ్యతను చెక్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఇక ఏఈవోలను తమ పరిధి దాటి ఇతర మండలాల్లో డ్యూటీలు వేయడం వల్ల స్థానిక పరిస్థితులపై అవగాహన తగ్గిపోతున్నది. దీని వల్ల అసలైన రైతులను గుర్తించడం కష్టంగా మారుతోంది.
కనీస గౌరవ వేతనం ఏదీ..?
ఏఈవోలు డిజిటల్ పంట సర్వే, వెరిఫికేషన్, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ, పీఎం కిసాన్ గ్రీవెన్సెస్, రైతు నమోదు, రైతు నేస్తం, ప్రకృతి వ్యవసాయం, విత్తనాల అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదనంగా ధాన్యం నాణ్యత కూడా పరిశీలిస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించి క్వింటాల్‌కు కొంత మేర కమీషన్ వస్తున్నది. ఇది ధాన్యం సేకరణలో భాగస్వాములైన వివిధ విభాగాల ఉద్యోగులకు అందుతుంది. కానీ అదనపు బాధ్యతలు మోస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులకు మాత్రం కనీస గౌరవ వేతనం కూడా అందని పరిస్థితి నెలకొంది. పీపీసీ విధులకు గాను క్వింటాల్‌కు రూ.6 ఇవ్వాలని ఏఈవోలు విజ్ఞప్తి చేస్తున్నారు.