కట్టంగూర్, సెప్టెంబర్ 25 : ఈ నెల 28న కట్టంగూర్‌లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల చేసి మాట్లాడారు. అసంఘటిత రంగాలైన భవన నిర్మాణం, ఇతర పారిశ్రామిక వాడల్లో పనిచేసే మహిళ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లలో పని చేసే గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వీఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సదస్సుకు 33 మండలాల నుండి శ్రామిక మహిళలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ, శ్రామిక మహిళ సంఘం మండల కన్వీనర్ చెరుకు జానకి, ఆశ వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి, కార్మికులు ఆశ వర్కర్లు శోభ, నర్సమ్మ, రేణుక, ధనమ్మ పాల్గొన్నారు.