రామగిరి, ఏప్రిల్ 1: కార్మికుల హక్కులను కాలరాసేలా కేం ద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సం స్థల్లో పనిచేసే కార్మికులు భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలను ధరించి సీఐటీయూ, బీఆర్ఎస్వీ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు.
మరో వైపు ఆయా సంస్థల ఎదుట సైతం ప్లకార్డు, జెండాలు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు ఐక్యంగా ఉద్యమించి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నల్లగొండలోని సుభాష్ విగ్రహం, జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి , ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఏఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు బొల్గూరి నరిసింహ తదితర నేతలు ఈ సందర్భంగా మాట్లాడారు. పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించి, పాత చట్టాలు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కార్మికులు 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు కేంద్రం తెచ్చిందని నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు ఎటువంటి హకులు లేకుండా చేసే లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో అందరినీ ఐక్యం చేసిపోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, కార్యదర్శి ఎండీ సలీం, వివిధ సంఘాల నాయకులు బొమ్మిడి నగేష్, అవుట రవీందర్, సీహెచ్.అనురాధ, యూసుఫ్, నాగరాజు, నరసింహ, సీతారాములు, ఇందూరి సాగర్, సుధాకర్‌రెడ్డితోపాటు పలు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.