నీలగిరి, డిసెంబర్9 : ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల ఎంపికై జిల్లాకు వచ్చిన 192 పురుష, 99 మహిళ కానిస్టేబుళ్లకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఎంతో ఉన్నతమైందని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలంటే అది పోలీస్ శాఖ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. శిక్షణలో తెలిపిన విధంగా నియమ నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 35 ఫిర్యాదులు రాగా వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.