నల్లగొండ, జూన్ 05 : ఆత్మస్థైర్యంతో తగిన సమయంలో ప్రతిది నేర్చుకుంటే అన్ని రంగాల్లో విద్యార్థులు రాణిస్తారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా కూడా నేటికి లింగ వివక్షత కొనసాగుతుందన్నారు. ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు సమయం వృథా చేయకుండా ఇష్టంగా చదవడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. ఏ చిన్న అవకాశం దొరికిన దానిని ఉపయోగించుకొని ఎంచుకున్న గమ్యానికి చేరుకోవాలని చెప్పారు. ప్రభుత్వాలు మహిళలను ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళలు స్వశక్తితో ఆర్ధికంగా నిలబడినప్పుడే అన్ని రకాలుగా అభివృద్ది చెందుతారన్నారు. స్వయం శక్తితో ఆర్ధికంగా ఎదిగినపుడే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తారని తెలిపారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఎంవీఎన్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ విద్యను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు యువతులు, మహిళలు టైలరింగ్ తోపాటు బ్యూటీషియన్, చిన్నచిన్న వ్యాపారాల్లో నైపుణ్యం పెంచుకుంటే ఆర్థికంగా తమ కుటుంబానికి సహాయ పడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అభివృద్దిలోకి రావాలని విద్యార్థి, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. సమాజంలో నేటికి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు, ఆత్మ రక్షణకు కరాటేలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సుగర్, బిపి, మూర్చ, పక్షవాతం రోగులకు ప్రతినెల మూడో అధివారం మందులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ గ్రంధాలయాన్ని కంప్యూటర్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. వీటితో ప్రతి సంవత్సరం ఎంఏ అర్థశాస్త్రం పీజీ ప్రవేశ పరీక్షకు డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య గారి ఆధ్వర్యంలో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు గ్రూప్-2, బ్యాంక్ పిఓఎస్, డిఎస్సీ అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నామని తెలిపారు. పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతి యువకులకు, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తమ ట్రస్ట్ పని చేస్తుందన్నారు. వేసవి కాలంలో కంప్యూటర్, కరాటే, టైలరింగ్ నేర్పించినట్లు వివరించారు. తమ సంస్థ ఇచ్చే అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్యాకల్టీ పి.శంకర్, ఐద్వా నాయకురాలు ఎం.ప్రభావతి, సరోజ, అనురాధ, అరుణ పాల్గొన్నారు.