డిండి, డిసెంబర్ 27 : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను మహిళ హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చీరతో చెట్టుకు ఉరివేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సీఐ సురేశ్ విలేకరులకు తెలిపారు. డిండి మండలంలోని దేవత్‌పల్లి గ్రామానికి చెందిన రమావత్ కుమార్, లక్ష్మి భార్యాభర్తలు. గ్రామంలో ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారు.
అయితే సంవత్సరం క్రితం బతుకు దెరువు కోసం భార్యాభర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు. కుమార్ ఆటో నడుపుతుండగా లక్ష్మి భవననిర్మాణ పనుల్లో కూలికి వెళ్లేది. అదే క్రమంలో తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వంగాల మధుతో లక్ష్మికి ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులు అక్కడే ఉన్న భార్యాభర్తలు అనంతరం తిరిగి గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. లక్ష్మిని కలిసేందుకు వంగాల మధు తరచూ గ్రామానికి వచ్చేవాడు. అయితే తమ మధ్య ఉన్న సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అతడిని చంపాలని లక్ష్మి నిర్ణయించి విషయాన్ని ప్రియుడికి తెలిపింది.
ఈ విషయంతో తమకు సాయం చేయాలని వంగాల మధు తన స్నేహితుడు గుడిమల్కాపురానికి చెందిన నల్లారపు సాయి కిరణ్‌ను కోరగా అతను అంగీకరించాడు. ఈ నెల 23న రాత్రి రమావత్ కుమార్, భార్య లక్ష్మితో కలిసి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వంగాల మధు అతడి స్నేహితుడు సాయికిరణ్‌తో కలిసి వారి పొలం వద్దకు వెళ్లాడు. భార్య, ప్రియుడు, అతడి స్నేహితుడు కలిసి కుమార్‌ను గొంతు నులిమి హత్య చేశారు.
అనంతరం చీరతో ఉరి వేసి చెట్టుకు వేలాడదీశారు. కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే కుమార్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరకొండ డీఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి, వంగాల మధు, సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేశ్ తెలిపారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ సురేశ్, ఎస్ఐ రాజు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.