ట్రైనీ పైలెట్ మహిమ మృతి
పేలుడుతో చెల్లాచెదురైన విమాన శకలాలు
గాల్లోకి ఎగిరిన 10 నిమిషాల్లోనే ఘోరం
పెద్దవూర మండలం తుంగతుర్తి శివారులో ప్రమాదం
దర్యాప్తు చేపడుతున్న పోలీస్, డీజీసీఐ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భగత్
హాలియా/పెద్దవూర, ఫిబ్రవరి 26;నాగార్జునసాగర్ రైట్‌బ్యాంక్ సమీపంలోని ఫ్లైటెక్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్లో మహిమ నాలుగు నెలల నుంచి శిక్షణ పొందుతున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా శనివారం ఉదయం 10:40 గంటలకు ఆమె బయల్దేరిన సెస్నా 152 జనరల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సరిగ్గా పది నిమిషాల్లోనే పెద్దవూర మండలం తుంగతుర్తి శివారులోని బత్తాయి తోటలో నేలకూలింది. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల రైతులు, జీవాల కాపరులు వెళ్లేసరికే అక్కడ చెల్లాచెదురైన శకలాలు, శరీర భాగాలు మాత్రమే మిగిలాయి.సాంకేతిక కారణాలే ప్రమాదానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. పోలీస్, డీజీసీఐ దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, చలకుర్తి పరిధిలోని పూలగూడెం వద్దే శిక్షణ విమానం నుంచి భారీ శబ్ధం వినిపించిందని స్థానిక రైతు కొండల్ చెప్తున్నారు. అక్కడికి కిలోమీటరున్నర దూరంలోనే ప్రమాదం జరిగింది. ఎయిర్ క్రాప్ట్ అతి తక్కువ ఎత్తులోనే వచ్చిందని, ట్రైనీ పైలెట్ తమను అక్కడి నుంచి వెళ్లిపోండంటూ చేతితో సైగలు చేసిందని జీవాల కాపరులు తెలిపారు.
పైలట్ కావాలన్న బలమైన కోరిక, ఆత్మ విశ్వాసంతో ఆమె తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని ఫ్లైటెక్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ దాదాపు పూర్తి చేసుకుంది. విధి వక్రీకరించడంతో తాను నడుపుతున్న విమానం ఒక్కసారిగా నేలకూలి దుర్మరణం పాలైంది. శనివారం ఉదయం పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ..తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన మహిమా గజరాజ్ (29) పైలట్ కావాలనే కోరికతో నాగార్జున సాగర్ రైట్‌బ్యాంక్ కాలనీ సమీపంలో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్లో గత అక్టోబర్‌లో చేరింది. ఐదు నెలలుగా శిక్షణ పొందుతూ ఇప్పటికే సుమారు 41 గంటల పాటు విమానం నడుపడంలో శిక్షణ పొందింది. ట్రైనింగ్‌లో భాగంగా ఉదయం 10.40గంటలకు సెస్నా 152 చాపర్ ఎయిర్ క్రాప్ట్ను టేకాఫ్ తీసుకొని బయల్దేరగా పది నిముషాల వ్యవధిలోనే పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో పొలాల మధ్య బత్తాయితోటలో నేలకూలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ మహిమ అక్కడికక్కడే మృతి చెందింది. విమానం కూలిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన తుంగతుర్తి గ్రామస్తులు, గ్రామ వీఆర్ఏ అంజి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, మిర్యాలగూడ డీఎస్పీ, వెంకటేశ్వర్రావు, ఆర్డీఓ రోహిత్ సింగ్ ప్రమాద స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైలట్ మృతదేహానికి అక్కడే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు…
శిక్షణ విమానం కూలిపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందా లేక హైటెన్షన్ విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో అదుపు తప్పిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రామన్నగూడెం సమీపంలో విమానం బాగానే ఎగురుతూ కనిపించిందని, అదే గ్రామానికి చెందిన నక్క శ్రీను తెలుపగా, చలకుర్తి పరిధిలో పూలగూడెం సమీపంలో విమానం గాలిలో ఉండగానే పెద్ద శబ్దం వినిపించిందని, కాసేపటికే నేలకూలిందని రైతు లింగంపల్లి లక్ష్మయ్య తెలిపాడు. తుంగతుర్తి సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తప్పించబోయి విమానం నేలను ఢీకొన్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
కన్నీరుమున్నీరుగా విలపించిన మహిళా భర్త పరంధామన్
విమాన శకలాల నడుమ కట్టుకున్న భార్య మాంసం ముద్దగా పడి ఉండటం చూసి ట్రైనీ పైలెట్ మహిమ గజరాజ్ భర్త పరంధామన్ కన్నీరు మున్నీరుగా విలపించారు. 2017లో మహిమా గజరాజ్తో పరంధామన్కు వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం మహిమ తండ్రి కరోనాతో మృతిచెందారు. ఇప్పుడు విమాన ప్రమాదంలో మహిమ మృతి చెందడంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమగ్ర దర్యాప్తు చేపడుతాం
శిక్షణ విమానం కూలిన ఘటనపై ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు సేకరించాం. ఉదయం సుమారు 10:50 గంటల సమయంలో గాలిలో విమానం అటుఇటూ ఊగుతా నేలను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు పోలీస్ శాఖ పక్షాన సమగ్ర దర్యాప్తు చేపట్టాం.
– రెమా రాజేశ్వరి, నల్లగొండ జిల్లా ఎస్పీ
శబ్దం వచ్చిన కాసేపటికే కూలింది
నేను నా భార్యతో కలిసి కందిచేను కోస్తుండగా నాగార్జునసాగర్ వైపు నుంచి విమానం రాకను గమనించా. చేను సమీపంలోకి రాగానే విమానం నుంచి గలగలమనే శబ్దం వినిపించింది. అతితక్కువ ఎత్తులో వెళ్తుండడంతో దాని వైపే ఇద్దరం చూస్తూ ఉన్నాం. కాసేపటికి గింగిరాలు తిరుగుతూ భారీ శబ్దంతో అది కూలిపోయింది. దగ్గరకు వెళ్లి చూస్తే ప్రదేశం మొత్తం పొగతో నిండి ఉండడంతో స్థానికులకు సమాచారం అందించాం.
– బొల్లెంపల్లి కొండల్, స్థానిక రైతు
ఘటనా స్థ్ధలాన్ని పరిశీలించిన డీజీసీఏ బృందం
పెద్దవూర, ఫిబ్రవరి 26 : మండలంలోని తుంగతుర్తి గ్రామ శివారులో శిక్షణా ఛాపర్ కుప్పకూలిన ప్రదేశాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బృందం శనివారం సాయంత్రం పరిశీలించింది. ఘటనాస్థలంలో అన్ని ఆధారాలను సేకరించారు. దర్యాప్తు అనంతరం ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని వెల్లాడిస్తామని వారు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నోముల భగత్ దిగ్భ్రాంతి..
శిక్షణా ఛాపర్ కూలి మహిళా పైలెట్ మృతి చెందిన ఘటనపై నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పెద్దవూర టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, సర్పంచ్ మెండె విష్ణుప్రియాసైదులు, ఉప సర్పంచ్ పగడాల గోపమ్మ వెంకట్‌రెడ్డి ఉన్నారు.