నడిగూడెం/త్రిపురారం, అక్టోబరు 14 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం పలు మండలాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (24), అదే గ్రామానికి చెందిన మామిడి పద్మతో కలిసి నడిగూడెం శివారులోని గట్ట మైసమ్మ ఆలయం వద్ద పత్తి తీసేందుకు వెళ్లగా, ఆ సమీపంలోనే పిడుగు పడింది. చెట్టు కింద అన్నం తింటున్న రమణ అక్కడికక్కడే మృతి చెందగా, పద్మకు తీవ్ర గాయాలు అవడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.
త్రిపురారం మండలంలో ఈదురు గాలితో కూడిన వర్షానికి వరి పైర్లు నేలవాలాయి. అంజనపల్లి, నీలాయగూడెం, త్రిపురారం, కొణతాలపల్లి పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. వరి పైరు కంకి దశలో ఉండడంతో ఈదురుగాలులకు తట్టుకోలేక నేలకు పడిపోతున్నాయి. మూడు రోజులను వర్షాలు పడడుతండడంతో కొన్నిచోట్ల మొలకలు కూడా వస్తున్నాయని రైతులు వాపోయారు.