చందంపేట, మార్చి 5 : వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటడంతో పల్లికాయ సాగు చేసిన రైతుల కష్టం మట్టిపాలు అవుతున్నది. కలిసి వస్తుందనుకున్న పంట బోరు బావుల్లో నీళ్లు ఇంకిపోయిన కారణంగా కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. చందంపేట మండలంలో రైతులు పత్తి తర్వాత అధికంగా పల్లికాయ(పల్లీ) సాగు చేస్తారు. ఏటా లాభాలు తెచ్చిపెడుతున్న పంట ఈ సారి రైతులను నిండా ముంచుతున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోయి చేలకు నీళ్లు అండం లేదు. దాంతో మొక్కలు వాడుబడుతున్నాయి. గింజ సరిగ్గా పోసుకోవడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని, అప్పులే మీద పడేట్టు ఉన్నాయని రైతులు వాపోతున్నారు.
చందంపేట మండలంలో గతంతో పోల్చితే పల్లికాయ సాగు తగ్గింది. గతంలో సుమారు 16,680 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 12,456 ఎకరాల్లో వేశారు. మిగతా విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు ఇంకిపోవడంతో మొక్కలు నీళ్లు సరిపోవడం లేదు. ఒక మొక్కకు 20 నుంచి 30 కాయలు కాయల్సి ఉండగా, 5 నుంచి 10 లోపు మాత్రమే ఉంటున్నాయి. దాంతో దిగుబడి విపరీతంగా తగ్గిపోతున్నది. రైతులు ఒక ఎకరా సాగుకు రూ.30వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పల్లికాయ రూ.6వేల నుంచి రూ.6,500 మాత్రమే ధర పలుకుతున్నది. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేకపోవడంతో మద్దతు ధర మాటే లేకపోతున్నది. దాంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కాగా, విత్తనాల కోసమే క్వింటాకు రూ.12వేల నుంచి రూ.13వేల వరకు చెల్లించాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. పెట్టుబడి కూడా వెళ్లేట్లు లేదు నాకున్న ఆరెకరాల్లో పల్లికాయ సాగు చేసిన. మొత్తం పెట్టుబడి లక్షా పాతిక వేలు వచ్చింది. పంటకు నీళ్లు లేకపోవడం, ఎండలు ముదరడంతోని దిగుబడి సరిగ్గా లేదు. కాని నాకు పెట్టుబడి కూడా వస్తదో రాదో అని అనుమానంగా ఉంది. ఆరెకరాల మీద 20 క్వింటాళ్ల పల్లికాయ అయినా వస్తదా, లేదా అన్నట్టు ఉంది. లాభం మాట దేవుడెరుగు.. మా కష్టానికి కూడా ఫలితం దక్కదు. పల్లికాయ తీసుకుంటే కూలీ ఖర్చులు పోనూ అంతగా మిగిలేదేమీ ఉండదు.
– పందిరి రామేశ్వరి, రైతు, ముడుదండ్ల
కౌలుపోనూ కష్టం వృథా
మా తండాలో 16 ఎకరాలు కౌలుకు తీసుకొని పల్లికాయ సాగు చేశాను. ఏటా వంద క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేది. ఈసారి భగర్భ జలాలు అడుగంటడంతో చేనుకు నీళ్లు అందించడం కష్టమైంది. ఇప్పుడు 60 క్వింటాళ్ల దిగుబడి రావడం కూడా కష్టమే. కౌలుకు భూమి ఇచ్చిన రైతులకే 2లక్షల రూపాయలు కట్టాలి. ఇంక మా కష్టం మట్టిలో పోసినట్టే.
-ఇస్లావత్ శంకర్, కౌలు రైతు, పోల్యానాయక్తండా