– ఒంటి గంటకే షాపులు ఓపెన్
– సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూంలోకి అనుమతి
నల్లగొండ, డిసెంబర్ 01 : మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో కొన్ని మద్యం షాపులు స్థానికులు, మరికొన్ని స్థానికేతరులు దక్కించుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాద్లోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 తర్వాతనే తెరవాలని, 6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. ఎమ్మెల్యే సూచించిన అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్తామని నిర్వాహకులు మాట ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం కొత్త మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. ఎమ్మెల్యే సూచన మేరకు మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో నేడు ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 1:00 గంట నుండి విక్రయాలు ప్రారంభించారు.
ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం వల్ల ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసై తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న తీరు, కుటుంబాల విచ్చిన్నం చూసి చలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించారు. బెల్ట్ షాపులను నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. దీంతో గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడి నియోజకవర్గ వ్యాప్తంగా క్రైమ్ రేటు తగ్గింది. కొత్తగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలవగానే టెండర్ల ప్రక్రియలోనే మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, మద్యం నియంత్రణపై సూచనలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయానికి మద్యం షాపుల యజమానులు తోడ్పాటును అందిస్తూ ముందుకొచ్చారు.