– రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
– నిందితులు ముగ్గురు అరెస్ట్
– కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు
చందంపేట, మే 23 : భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్యను, ఇందుకు సహకరించిన ఆమె ప్రియుడిని, అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ నెల 19న మృతిచెందిన రమావత్ నర్సింహ కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. కేసు వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19న చందంపేట మండలం బిల్డింగ్ తండాకు చెందిన రమావత్ నర్సింహ (51) తెల్దావరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి పక్కన తన మోటార్ సైకిల్‌తో కిందపడి మృతదేహంగా కనిపించాడు. సమాచారం అందుకున్న చందంపేట ఎస్ఐ లోకేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నర్సింహ కుమారుడు రమావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించినప్పటికీ, పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో నర్సింహ రెండో భార్య రమావత్ జ్యోతిపై అనుమానాలు వ్యక్తమవడంతో, ఈ నెల 22న డిండి సీఐ బీసన్న కేసు తదుపరి విచారణను స్వీకరించి జ్యోతిని విచారించారు.
విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమావత్ జ్యోతి తన అక్క రమావత్ లక్ష్మి అలాగే తన ప్రియుడు నేనావత్ రాజుతో కలిసి ముందస్తు పథకం ప్రకారం నర్సింహను హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులు ముగ్గురు కలిసి రమావత్ నర్సింహను ఎస్ఎల్బీసీ క్యాంపు నుండి తెల్దేవరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి సమీపంలోని కోరుట్ల శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అతడికి మద్యం తాగించి, అనంతరం అతడి నోరు, ముక్కు మూసి హత్య చేశారు. తర్వాత ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతుడిని అతని మోటార్ సైకిల్ పక్కన పడవేసి సీన్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా నర్సింహ గతంలో మోటార్ వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడేవాడని, అతనిపై దేవరకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్న విషయాన్ని ఉపయోగించుకుని, ఘటన స్థలంలో ట్రాక్టర్ బ్యాటరీ, పానర్ను ఉంచి, మృతుడు దొంగతనానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైనట్లు నమ్మించే ప్రయత్నం చేశారు.
పోలీసులు సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణను వేగవంతం చేయగా నిందితుల కుట్ర బయటపడింది. అనంతరం నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసిన విషయాన్ని అంగీకరించారు. ఈ కేసును దేవరకొండ డీఎస్పీ పర్యవేక్షణలో డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్ఐ లోకేష్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పీసీలు లచ్చు, నరసింహ, హెచ్‌జీలు యాదయ్య, రాందాస్ తదితర పోలీసు సిబ్బంది సమర్థవంతంగా ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.