యాదగిరిగుట్ట, నవంబర్ 9 : పుట్టిన రోజును సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పులిహోర, దద్దోజనం తిని వెళ్లారే తప్ప దేవస్థాన అభివృద్ధికి ఒక్క రూపాయి సైతం కేటాయించలేదని ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట పర్యటన వల్ల పైసా ప్రయోజనం లేదన్నారు.
గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చిన ప్రతిసారీ నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ప్రతి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని తెలిపారు. 95 శాతం పనులు పూర్తయ్యాయని మరో 5 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తు చేసినా నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టితే ఆలయానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు.
సీఎం పర్యటనలో హామీలు, నిధులు ఇస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతి పనినీ చరిత్రలో నిలచేలా చేశారని, ఆయన ఆనవాళ్లను తుడిచే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రారంభ దశలో చినజీయర్ స్వామి ఇచ్చిన సలహా మేరకు యాదాద్రి పేరు ప్రస్తావనకు వచ్చిందని తప్ప.. యాదగిరిగుట్టను యాదాద్రిగా మారుస్తూ బీఆర్ఎస్ ఎలాంటి జీవో విడుదల చేయలేదని స్పష్టం చేశారు.
ఇప్పటికీ అన్ని ప్రభుత్వ పత్రాలు, కార్యాలయాల్లో యాదగిరిగుట్ట అనే ఉంటుందన్నారు. ఇది తెలియకుండా యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మారుస్తున్నామని ప్రకటించడం అవగాహనరాహిత్యమేనని పేర్కొన్నారు. కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలపై ఉన్న ఆలోచన సీఎంకు కొత్త ప్రాజెక్టులపై లేదన్నారు. రేవంత్‌రెడ్డి రాక్షస పాలనకు నిరసనగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో.. ఇందిరమ్మ రాజ్యంలో ఎంత కొనుగోలు చేశారో త్వరలో లెక్కలతో చెబుతామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు సన్నవడ్లను కొనుగోలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమాను ఎగ్గొట్టి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడి భూములను కొల్లగొట్టారని తమపై ఆరోపనలు నిరూపించాలని, సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి పాలన చూసి మళ్లీ కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలు మదన పడుతున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కోశాధికారి అంకం నర్సింహా, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ బాబా, నాయకులు కోన్యాల నర్సింహ్మారెడ్డి, షేక్ దావూద్, గుండ్లపల్లి వెంకటేశ్, సీస శేఖర్, దండబోయిన వీరేశం, సీస నర్సింహా, గడ్డం చంద్ర, గ్యాదపాక క్రాంతి పాల్గొన్నారు.