నకిరేకల్, జూలై 24: నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార దాహంతో రౌడీయిజాన్ని, మాఫియాను, గంజాయిని పెంచి పోషిస్తున్నారని నల్లగొండ జిల్లా మాజీ జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అభివృద్ధి చేయమంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారని, పోలీస్ స్టేషన్లు వేదికగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సెటిల్ మెంట్లు చేస్తున్నారని పేర్కొ న్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, విజయం సాధించేలా కృషిచేయాలని, మనం చేసిన అభివృద్ధి పథకాలను, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నకిరేకల్ లోని సువర్ణ ఫంక్షన్ హాల్లో గురువారం బీఆర్ఎస్ నకిరేకల్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ఖ్యాతిని విశ్వవాప్తం చేసిన నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేండ్లు సుఖసంతోషాల తో ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలంటే లబ్ధిదారులు తలమునకలవుతున్నారని, మరో 2 నుంచి 3 లక్షలు జతచేసి కట్టుకునే పరిస్థితిలో వారు లేరన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అహర్నిశలు కృషి చేసి కొనుగోలు చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 70 నుంచి 80 శాతం మంది రైతులు మిల్లులకుపోయి అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం, కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, సంక్షేమ పథకాలు అంతకంటే లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షగట్టి కేసులు పెడుతోందని, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయ కోణంలో కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
42 శాతం బీసీ బిల్లు మోసపూరిత హామీ తప్ప అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కృష్ణార్జునులు లాగా కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ నాయకులను చీల్చి చెండాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంలకు కేరాఫ్ అడ్రస్ అని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మోసపూరిత హామీలతో గద్దెనెక్కారని, ఆ హామీలను అమలు పరిచే వరకూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని, గుడిలోకి రానివ్వొద్దనే విషపు సంస్కృతి నకిరేకల్‌లో కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శిలాఫలకాలపై పేర్లను తొలగించి, ధ్వంసం చేసినంతమాత్రాన చేసిన అభివృద్ధిని తుడపలేరని, ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ కుట్రలతో సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ నాయకులకు చీము, నెత్తురు ఉంటే శిలాఫలకాలను ధ్వంసం చేయడం కాదని, అభివృద్ధిలో పోటీపడాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ బలోపేతానికి కృషిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తుందన్నారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏఒక్క హామీని అమలుచేయడం లేదన్నారు. వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని, ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్‌లో కానీ, ఈ రేసింగ్‌లో కానీ ఎలాంటి రుజువులు చూపించలేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కలిసికట్టుగా చేసి సాధించామో అదేవిధంగా స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా పోరాడి ఎక్కువ స్థానాలు గెలుచుకుందామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, మాజీ జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, కన్నెబోయిన జ్యోతిబలరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, సోమ యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సందినేని వెంకటేశ్వరరావు, పెండెం సదానందం, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.