యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల బిల్లులు రాక మాజీ సర్పంచ్లు సతమతమవుతున్నారు. పదవీ కాలం ముగిసినా బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే బిల్లులు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ బుట్ట దాఖలైంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్న పైసా చెల్లించకుండా జాప్యం చేస్తున్నది. మరోవైపు సర్పంచ్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో చేసేదేంలేక వారు పోరుబాట పట్టారు.
ఉమ్మడి నల్లగొండలో 1740 గ్రామ పంచాయతీలకుగానూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 421, నల్లగొండలో 844, సూర్యాపేటలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి. గ్రామాల్లో ఈ నిధులతో ఆభివృద్ధి పనులు చేపడతారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన మురికి కాల్వలు, వీధిలైట్లు, పైపు లైన్ల లీకేజీలు, రోడ్ల శుభ్రత, పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, క్రీడా మైదానాలు, పంచాయతీ భవనాలు తదితర పనులను సర్పంచ్లు సొంత డబ్బులతో చేపట్టారు. కానీ ఇప్పటి వరకు బిల్లులకు మోక్షం లభించడం లేదు. బిల్లులు వచ్చే సమయంలోనే అధికారం మార్పిడి జరిగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో రూ. 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సర్పంచ్లు చెప్తున్నారు. ఎస్ఎఫ్సీతో పాటు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద కూడా భారీగా బిల్లులు పెండింగ్లో మూలుగుతున్నాయి. ఒక్కో మండలం నుం చి కోటి నుంచి రెండు కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం, మం త్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పైసా ఇవ్వడం లేదు.
వివిధ అభివృద్ధి పనులకు అధిక శాతం మంది మాజీ సర్పంచ్లు అప్పు చేసి ఖర్చు చేశారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా సర్పంచులకు కోట్లలో బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్థికంగా కుంగిపోయిన ఇద్దరు మాజీ సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలు ఉన్నాయి.
అధికారంలోకి వస్తే సర్పంచ్ల బిల్లులు వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. పెద్దఎత్తున ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం ముఖం చాటేసింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన మాజీ సర్పంచ్లు చేసేదేం లేక డిసెంబర్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మార్చి 31వ తేదీలోగా ఒక్క పైసా లేకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో మాజీ సర్పంచ్లు ఆందోళనలు విరమించుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఏప్రిల్ సగం గడిచినా ఇప్పటి వరకు వరకు ఒక్క పైసా చెల్లించలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకొని బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
రాజాపేట మండలంలోని జాల గ్రామ పంచాయితీలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రూ. 14 లక్షలకు పైగా రావాలి. పనులు చేసిన వెంటనే నిధులివ్వాలి. పదవీ కాలం ముగిసినా బకాయిల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. సర్కార్ స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలి.
– గుంటి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు