పెన్పహాడ్, జూన్ 21 : రైతాంగానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నారని, మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు. శనివారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాసారం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి17 నెలలు అవుతున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని నివారించి, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే భూ భారతిలో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన పేదలకు ఇంటి నిర్మాణానికి ఏడు లక్షలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు కొత్త పింఛన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధి బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు కొండమీది రాములు పాల్గొన్నారు.