నేరేడుచర్ల, డిసెంబర్ 18 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. కానీ నేటి ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం వహించడంతో డిజిటల్ బోధనకు అవాంతరాలు తప్పడం లేదు. గత ప్రభుత్వం డిజిటల్ బోధనకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విద్యా సంవత్సరం ముగుస్తుడడం, ఎన్నికలు రావడంతో అది ఆగిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం రాలేదు. దాంతో డిజిటల్ బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాం తో ఉపాధ్యాయులే తమ సెల్ఫోన్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఆ డేటా ద్వారా పాఠాలు బోధిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు 2022-23 విద్యా సంవత్సరంలో డిజిటల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యార్థులకు డిజిటల్ బోర్డుపై వీడియోలు చూపిస్తూ బోధించడం ద్వారా సులువుగా అర్థమవడంతోపాటు ఎక్కువ కాలం గుర్తుండిపోతుందని దీనిని అమలు చేసింది. తొలుత 8,9,10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ బోధన చేపట్టాలని నిర్ణయించినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 2023 మార్చిలో కొన్ని పాఠశాలలకు డిజిటల్ బోర్డులు మంజూరయ్యాయి. అప్పటికే విద్యాసంవత్సరం పూర్తవుతుండటంతో కొన్ని చోట్ల వాటిని నామమాత్రంగా ఉపయోగించారు. మరి కొన్ని చోట్ల భద్రపరిచి 2023-24 విద్యాసంవత్సరం ఆరభంలో ఏర్పాటు చేశారు. అదే విద్యా సంవత్సరంలో అన్ని ఉన్నత పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కల్పిస్తామని చెప్పారు. నేటికీ కల్పించలేదు. కొందరు ఉపాధ్యాయులు హాట్‌స్పాట్ ఉపయోగిస్తున్నా నెట్ సిగ్నల్ సరిగా రాక పాఠాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం అందించిన డిజిటల్ ప్యానల్ బోర్డులు ఒక్కొక్కటి సుమారు రూ. 3.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటాయి. పాఠశాలల్లో వాటిని భద్రపర్చాలంటే ప్రధానోపాధ్యాయులకు కత్తిమీద సాములాంటిదే. అనేక పాఠశాలలు ఊరికి దూరంగా ఉండటంతో వాటికి రక్షణ లేకుండా పోతున్నది. తాళాలు వేసినా కొన్ని పాఠశాలలో కంప్యూటర్స్‌తోపాటు ఇతర సామగ్రి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఇంత విలువైన ప్యానల్స్‌ను జాగ్రత్తగా ఉంచడం కష్టంగానే ఉందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు కాపలాదారులను నియమించారు. ఆ తర్వాత వారి ఊసే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం డిజిటల్ బోధన చేసే విధంగా నెట్ సౌకర్యం కల్పించడంతోపాటు వాటి రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరుతున్నారు.
తరగతి గదిలో డిజిటల్ బోధనతో పాఠాలు చెప్పడంతో ఎంతో మంచిగా అర్థమవుతున్నాయి. కానీ కొన్ని సమయాల్లో నెట్ సక్రమంగా రాకపోవడంతో పాఠాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా కాకుండా పూర్తి స్థాయిలో డిజిటల్ బోధన చెప్పే విధంగా పాఠశాలలకు ప్రభుత్వమే నెట్ సౌకర్యం కల్పించాలి.
-నికిత, 9వ తరగతి, పెంచికల్‌దిన్నె జడ్పీహెచ్ఎస్, నేరేడుచర్ల
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం డిజిటల్ బోర్డులను ప్రభుత్వం ఇచ్చింది. వాటిపై పాఠ్యంశాలను చెప్తున్నాం. కానీ నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించక పోవడంతో మా ఫోన్లలో సొంతంగా నెట్ బ్యాలెన్స్ వేయించి హాట్‌స్పాట్ ఉపయోగించి బోధిస్తున్నాం. నెట్ స్పీడ్ సరిపోక విద్యార్థులకు కొద్దిమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
-శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు, పెంచికల్‌దిన్నె, జడ్పీహెచ్ఎస్, నేరేడుచర్ల