సూర్యాపేట, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మనం ఎన్నికలప్పుడు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చినం…రెండేండ్లు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయాం…మనం అన్నీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో జనం మనపై గుర్రుగా ఉన్నరు… ఎక్కడికైనా వెళితే ఇస్తామన్నవి ఇవ్వట్లేదేందని అడుగుతున్నరు… వాటి పర్యవసానమే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థుల ఓటమి అని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆ ముగ్గరు ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఓటమిపాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించింది.
అయితే పార్టీలోని ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లేనందునే పార్టీ మద్దతుదారులు ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వనీయంగా తెలిసింది. కాంగ్రెస్ వారే రెబల్స్‌గా బరిలోకి దిగడం ప్రతిపక్షాలకు కలిసి వచ్చిందని వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలపై అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, మూడొంతుల సర్పంచ్, స్థానాలు గెలిచేందుకు కృషి చేయాలని చెప్పినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సంబంధిత ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇన్చార్జిలు ఉన్న చోటు కంటే లేని చోటనే కాస్త ఎక్కువ స్థానాలు గెలిచామని, ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభమని అంతర్గత సమీక్షలో నిలదీసి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్లే పార్టీకి నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఓటమిపై ఎమ్మెల్యేలను బాధ్యులను చేస్తుండటంతో సహనం కోల్పోయిన ఓ ఎమ్మెల్యే సమన్వయ లోపం కాదు.. అసలు మన ప్రభుత్వంపై ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరని చెప్పడంతో వెంటనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గొంతు కలుపుతూ ఎదురు దాడికి దిగారట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని మాటిచ్చాం.. కానీ అమలు చేయడంలో విఫలమయ్యామనే భావనలో జనం ఉన్నారు… రెండేండ్లు పూర్తయినా ఇంకెప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పారట. అంతేకాదు వృద్ధులు ఎదురైతే మాకు నాలుగు వేల పింఛన్ ఎప్పుడిస్తావంటూ కదలనివ్వడం లేదని, ఏం సమాధానం చెప్పాలో తెలియక నోరు మూసుకొని పారిపోతున్నామని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక రైతులైతే మన పార్టీ పేరు చెబితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇలా అన్ని వర్గాలు మనకు దూరం అవుతున్నారు..
బీఆర్ఎస్ నాయకులు మనపై తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారని ఓ ఎమ్మెల్యే చెబుతుండగా.. మనం గతంలో ఏనాడూ లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాం.. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం.. వాటిని ప్రచారం చేయకుండా జనం చెప్పే వాటిని విని, మాకు చెబుతారా అంటూ సీఎం వారి నోళ్లు మూయించారట. అనంతరం ఆ ఎమ్మెల్యే మరుసటి రోజు వెళ్లి అధినాయకుడికి శాలువా కప్పి సారీ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకే జనం ఓటెయ్యలేదంటే మరి పరిషత్ ఎన్నికల్లో గుర్తులు ఉంటాయి… వాటి ఫలితాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా.. ఏదో ఒకటి చేసి సర్పంచ్‌లందరికీ కాంగ్రెస్ ముద్ర వేసి సమావేశాలు ఏర్పాటు చేసి, మనకే సర్పంచ్ల బలం ఎక్కువగా ఉందంటూ ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.