కట్టంగూర్, అక్టోబర్ 24 : కట్టంగూర్ మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు, కురుమర్తి, బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయి. కల్మెర గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం లోతట్టు ప్రాంతం కావడంతో భారీ వర్షానికి రైతుల ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న వరద కాల్వను ఆ ప్రాంతంలోని రైతులు ధ్వసం చేసి ఆక్రమించడంతో వరద నీరంత కేంద్రంలోకి చేరడంతో ధాన్యం రాసులు నీటిలో మునిగిపోయాయి.
వర్షాలకు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా మ్యాచర్ రావడం లేదనే సాగుతో కాంటాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కల్మెర పీఏసీఎస్ కేంద్రంలో నిలిచిన వర్షపు నీటిని తాసీల్దార్ పుష్పలత దగ్గరుండి జేసీబీతో కింది ప్రాంతానికి తరలించారు.
వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. వారం రోజుల క్రితం ఐదు ఎకరాల ధాన్యాన్ని కల్మెర పీఏసీఎస్ కేంద్రానికి తెచ్చి ప్రతి రోజు ఆరబెడుతున్నాం. కేంద్రాన్ని ప్రారంభించి మ్యాచర్ రావడం లేదని అధికారులు కాంటా వేయడం లేదు. రాత్రి, పగలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం. అకాల వర్షానికి సుమారు ఐదు బస్తాల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

Kattangur : కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం.. పట్టించుకోని అధికారులు