రామగిరి/సూర్యాపేట టౌన్/ మోత్కూరు, మార్చి 30 : తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నారు. ప్రత్యేక పూజలతో తమ ఇష్ట దైవాలను కొలిచారు. ఉగాది పచ్చడితోపాటు స్వీట్లు తదితర వంటకాలు చేసి కుటుంబ సమేతంగా ఆస్వాదించారు.
ఆలయాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగదీశ్‌రెడ్డి స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, జనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మోత్కూరు ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. ఫలహారం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు.