బొడ్రాయిబజార్, మార్చి 4 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 వేల పోస్టులకు తగ్గకుండా మెగా డీఎస్సీ వేయాలని, లేకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. ప్రభుత్వం వేసిన మినీ డీఎస్పీని వ్యతిరేకిస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో మొత్తం 11,062 పోస్టులు ప్రకటించిందని, ఇందులో అధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 2,629 మాత్రమే ఉండడం బాధ కలిగిస్తుందన్నారు.
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ పోస్టులకు అర్హత లేకపోవడం దారుణమన్నారు. గత నోటిఫికేషన్‌కు ప్రస్తుత నోటిపికేషన్‌కు ఎలాంటి పోస్టులు పెరుగలేదన్నారు. మార్చిలో పదవీ విరమణ చేస్తే ఖాళీ అయ్యేవాటిని కలిపి 24వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖాళీలను గుర్తించి టెట్ నిర్వహించాలని, ఆ తరువాత 20 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తగ్గకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై హైదరాబాద్‌లో జరుగుతున్న డీఎస్సీ ధర్నాకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నిరుద్యోగులు శ్రీనివాస్, వెంకన్న, మహేశ్, సైదులు, శ్రవణ్, రమాదేవి, శ్రీదేవి, మాలతి, జానయ్య, హారిక, రాధిక, కవిత, లింగయ్య, నజీర్ పాల్గొన్నారు.