యాదగిరిగుట్ట, ఆగష్టు21: బీఆర్ఎస్ పదేండ్ల కా లంలో దర్జాగా కాలరెగరేసి ఎవుసం చేసుకున్న రైతులు..చేతగాని రేవంత్‌రెడ్డి పాలనలో యూరి యా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పిస్తే, నేడు సీజన్ మొదలై ఆరు నెలలు కావొస్తున్నా ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వీడటంలేదని మండిపడ్డారు.
గురువారం యాదగిరిగుట్టలో ఆమె మీడియాతో మాట్లాడారు. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే యూరియా అవసరాన్ని అంచనా వేసి, నిల్వలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యూరియా, ఎరువులు, విత్త నాలపై సీఎం ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా భావిస్తున్న రేవంత్‌కు రైతుల సమస్యలు తీర్చాలన్న సోయిలేదన్నారు. ఊరూరా రైతులు క్యూలైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి వర్షంలో తడుస్తుంటే..రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసుల సేవ లో తరిస్తున్నాడని విమర్శించారు.
రేవంత్ పాలనపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని రాష్ట్రంలో రేవంత్‌ను తిట్టని రైతు లేడని, శాపనార్థాలు పెట్టని మహిళ లేదన్నారు. ఇంత జరుగుతున్నా పత్తాలేకుండా పోయిన రేవంత్‌ను రైతుల పక్షాన ప్రశ్నించేందుకే మీడియా సమావేశం ఏర్పా టు చేసినట్లు వెల్లడించారు. రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత కరెంటు, రైతుబీమా ప్రీమియం చెల్లింపు, రైతు ఆత్మహత్యలను అడ్డుకోవడం, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఫెయిలైందన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తరిమికొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లే సమయాన్ని ఎరువులపై పెట్టి ఉంటే రైతులకు ఇంత దుస్థితి వచ్చేది కాదన్నారు. కేంద్రం నుంచి యూరియా కరెక్ట్‌గానే వస్తోందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పారన్నారు. కార్యక్రమంలో కర్రె వెంకటయ్య, రవీందర్‌గౌడ్, ఒగ్గు బిక్షపతి, ఆవుల సాయి, గంగసాని నవీన్, పాండవుల భాస్కర్‌గౌడ్, బాబురావుగౌడ్, బాలసిద్ధులు, రాజేశ్‌యాదవ్ ఉన్నారు.