యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 8 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిని వేరే చోటుకు తరలిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. మండలంలోని మల్లాపురం గ్రామానికి మంజూరైన వైద్య కళాశాల, ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వైద్య కళాశాలను మంజూరు చేశారన్నారు.
మల్లాపురం గ్రామంలోని వెయ్యి మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సంకల్పించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వైద్య కళాశాల భువనగిరిలో ప్రత్యక్షమైందన్నారు. ఇలానే ఊరుకుంటే కొడంగల్‌కు తరలించుకుపోయే అవకాశం ఉందని తెలిపారు. భువనగిరిలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రారంభమైందని, జాతీయ వైద్య కౌన్సిల్ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది వరకు శాశ్వత భవనాలను నిర్మించకపోతే వైద్య కళాశాల రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మల్లాపురం గ్రామంలో వైద్య కళాశాల నెలకొల్పితే ఎమ్మెల్యే నిర్ణయించిన వారినే సర్పంచ్, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో వైద్య కళాశాల రావడం ఎమ్మెల్యే ఐలయ్య ఇష్టంలేనట్లుగా వ్యవహరిస్తున్నారని, స్థల సేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మల్లాపురం గ్రామస్తులు ఏకమై వైద్య కళాశాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉందని ఎస్ఐ ఉదయ్‌కుమార్ చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు దీక్షను విరమించారు. దీక్షలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఒగ్గు మల్లేశ్, యువజన విభాగం గ్రామ నాయకులు కర్రె శేఖర్, మంత్రి భిక్షపతి, మోట రమేశ్, శేఖర్, నరేందర్, శ్రీనివాస్, సిద్ధులు, శ్రీశైలం, రాజు, హిమామ్, కార్తీక్, రాజశేఖర్, ప్రశాంత్, రాంబాబు, రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.