మునుగోడు, మే 08 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు గుర్తుగా వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు తొలగిస్తున్నారని, ఇది రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చర్యలను ప్రజల గమనిస్తున్నారు, సమయం చూసుకుని తగిన బుద్ధి చెప్తారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పక బదులిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ప్రారంభించిన క్యాంప్ కార్యాలయ శిలాఫలాకాన్ని కూలగొట్టడాన్ని నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి గురువారం మునుగోడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. క్యాంప్ కార్యాలయాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ కార్యాలయంపై తన పేరు ఉన్న శిలాఫలకాన్ని తీసేసినట్లు దుయ్యబట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా తన పాలనలో వేసిన శిలాఫలకాలను కూలుస్తున్నట్లు ఆరోపించారు.
మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పేరుతో వెడల్పులో భాగంగా ఒకసారి 60 ఫీట్లు, మరోసారి 100 ఫీట్లు అని ఇండ్ల యజమానులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. మునుగోడును మున్సిపాలిటీ చేస్తున్నాం అన్నారు. మరి ఏమైంది, ఇప్పటి వరకు దాని ప్రస్తావనే లేదన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని స్థితిలో ఉన్నారంటే ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిలబడవన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని, పోలీసులు అధికార పార్టీకి విధేయులుగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.