తుంగతుర్తి, జూలై 13 : బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు బారిన పడిన తెలంగాణ రైతులను ఏ విధంగా ఆదుకుంటారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోసి రక్తం వెదజల్లితే పంటలు పండుతాయని అనడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఒక బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఆక్షేపణీయామని, ఇలాంటి మాటలు సామాన్య కార్యకర్త కూడా మాట్లాడారని అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్ రెడ్డి తమ వైఖరి మార్చుకోకపోతే త్వరలో మీకు, మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇకనైన కండ్లు తెరిచి ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేసే ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.