పెన్పహాడ్, జూలై 31 : సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపికృష్ణ అన్నారు. గురువారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మండలంలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో కలిసి వారు చర్చించారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటి వారు సహకరించాలన్నారు. హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను గౌరవించాలని, అందరిని సమానంగా చూడాలని, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కుల, మత, వర్ణ భేదం, వివక్ష, అంటరానితనం రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అజీజ, జూనియర్ అసిస్టెంట్ నజీర్, పంచాయతీ కార్యదర్శి జానకి రాములు, కొండమీది గోవిందరావు, వరకల లక్ష్మయ్య, వాస వెంకటయ్య, వాస రామస్వామి, అనంతుల శ్రీశైలం పాల్గొన్నారు.