కట్టంగూర్, అక్టోబర్ 22 : ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యా అర్హతలు కలిగిన 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన నిరుద్యోగులు జాబా మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో 250 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నకిరేకల్ నుంచి బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని నిరుద్యోగ యువత సకాలంలో హాజరై ఉపాధి అవకాశాలు పొందాలని పేర్కొన్నారు.