రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 12 : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉజ్జినీ రత్నాకర్ రావు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం (AITUC) నల్లగొండ జిల్లా 7వ మహాసభకు అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు సమస్యల నిలయంగా మారిందన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు. గత కొన్ని నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్ చెకప్ ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సంక్షేమ బోర్డును ఎత్తి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దాని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక విధాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజమైన కార్మికులు లబ్ధి పొందే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత లేని వారందరూ కూడా లేబర్ కార్డులు తీసుకోవడం వల్ల సంక్షేమ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. బోగస్ కార్డులపై సమగ్ర విచారణ జరిపించి వాటిని తొలగించాలని లేబర్ అధికారులను కోరారు. ఈ నెల 21, 22 తేదీల్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ రెడ్డి ధోటి వెంకన్న, జిల్లా నాయకులు గుండె రవి, రేవెల్లి యాదయ్య, కె.నాగిరెడ్డి, అలమోని మల్లయ్య, బెల్లం శివయ్య, ఈద రాములు, రామలింగయ్య, శ్రీను, దేవయ్య, లక్ష్మీ నరసయ్య, నాగార్జున, మనీ, గీతపనివారల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు, వీరస్వామి, నరేందర్, వెంకన్న, అంకారావు, భిక్షం, మధు, జెల్ల శ్రీను పాల్గొన్నారు.